ఆర్. యదునందనుడు (@ యదు – ఎక్స్)
సింగర్ హరిహరణ్ ఒక ముఖాముఖిలో మాట్లాడుతూ సాహిత్యానికి సంగీతం తోడవ్వాలే కానీ, సంగీతానికి సాహిత్యం కాదు అనన్నారు. బాణీలో ఎంత మాధుర్యం ఉన్నా, ప్రేక్షకులు ముందుగా ఒక పాటని గుర్తు తెచ్చుకునేది, నెమరు వేసుకునేది అందులోని మాటలతోనే.
దైనందిన జీవితంలో పాట ఒక ఆసరా. ఒక ఆటవిడుపు. కొన్ని పాటలు ఆలోచింపజేస్తాయి, కొన్ని మనసుని హత్తుకుంటాయి.
అలాంటి అనేకానేక పాటల్లో నాకు దగ్గరైన ఓ పాట RX 100 చిత్రంలో చైతన్య ప్రసాద్ రాసిన ‘పిల్లా రా.’ దీనికి ముఖ్య కారణం ఈ పాటలోని సన్నివేశాలు మా యానాం మరియు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం. మరొకటి, ఇందులో కవి ఒక ప్రియుడి నిరీక్షణనీ, ఆవేదనని సులువైన భాషలో ఆ భావం యొక్క ఆర్ద్రత తగ్గకుండా అక్షరీకరించడం.
ఈ పాట గురించి రచయిత మాట్లాడుతూ, ప్రేయసి కోసం చేసే వెతుకులాటని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశానని, దానికి దర్శకుడిచ్చిన సందర్భం కూడా సరిగ్గా అనుకూలించిందని చెప్పారు. ప్రారంభవాక్యమైన “మబ్బులోన వానవిల్లులా (మేఘాల చాటున దాగి కవ్విస్తున్న ఇంద్రధనస్సులా)… మట్టిలోన నీటి జల్లులా… గుండెలోని ప్రేమ ముల్లులా… దాగినావుగా…” తోనే సున్నితమైన సృజనాత్మకత మనల్ని పలకరిస్తుంది.
మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియని ప్రేయసి కోసం చేసే నిరీక్షణలో బాధ ఉన్నా, ఆ వేచి చూడడంలో కించిత్ ఆనందం కూడా ఉంది. ఈ సందిగ్ధత గురించి ప్రియుడు ప్రస్తావిస్తూ ఆ అమ్మాయిని ఇలా అడుగుతాడు: “ప్రేమ పిచ్చి పెంచడానికా? చంపడానికా?
ఇదే సున్నితత్వాన్ని కొనసాగిస్తూనే చివర్లో కవి ఒక తీవ్రమైన పోలిక కూడా చేశారు. “గుండేకోసి… నిన్ను అందులో దాచి… పూజించనా రక్తమందారాలతో...” పైకి గంభీరంగా అనిపించినా, నిజానికి ఇక్కడ విరబూసిన రక్తమందారాలు: ప్రియుడి అశ్రువుల్లో ఇంకి పెరిగిన ప్రేమవృక్షానికి పూసినవి!
ఈ పాటలో నాకు నచ్చిన మరో అంశం ప్రియుడు తన ఎడబాటుకు స్వయంకృతాపరాధం కూడా ఓ కారణమేమోనని గ్రహించి, ఆ అమ్మాయిని బ్రతిమాలుతూ మరో అవకాశం ఇమ్మని ఇలా అర్థిస్తాడు “కాలాన్నే మనం తిరిగి వెనకికే తొద్దామా… మళ్ళీ మన కథనే రాద్దామా… ఎల్లా విడిచి బ్రతకనే…??”
