పార్టీ ఫిరాయింపుల పర్వంలో మళ్ళీ తెరపైకి ‘ఆంధ్ర’ x ‘తెలంగాణ’

టి. సందీప్ 


2014కి పూర్వం, దాదాపు ఒక దశాబ్దం పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినిపించిన హాట్ టాపిక్ ‘ఆంధ్ర – తెలంగాణ’. కానీ 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో, అప్పటి నుండి ఆంధ్ర – తెలంగాణ టాపిక్ నెమ్మదిగా కిందకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. సరిగ్గా 10 ఏళ్ళ తరువాత, అంటే 2024లో మరొకసారి ఆంధ్ర – తెలంగాణ లైమ్ లైట్ లోకి వచ్చింది. 

దానికి సందర్భం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి, హుజురాబాద్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి మధ్య తలెత్తిన వాగ్వివాదం. 

BRS తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దశలవారీగా కాంగ్రెస్ లో చేరిపోయారు. దీనిపైన యాంటీ  డెఫెక్షన్ చట్టం క్రింద కేసు నడుస్తోంది. అందులో హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఇంకొక నెలలో దీనిపైన స్పీకర్ తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఇంతలో శాసనసభలో సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే కి ఇచ్చే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ పదవి అరికెపూడి గాంధీకి ఇవ్వడంపై తీవ్ర దుమారం చెలరేగింది. 

కాంగ్రెస్ లో చేరి, యాంటీ డిఫెక్షన్ చట్టం దృష్టిలో ఉన్న ఎమ్మెల్యేకి ఆ పదవి ఎలా ఇస్తారు అనే దాని పైన మొదలైన చర్చ, చివరికి పాడి కౌశిక్ రెడ్డి “నేను అసలైన తెలంగాణ బిడ్డను. నువెక్కడ ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ నా పైన దాడి చేస్తే నేను నా తెలంగాణ పవరేంటో చూపిస్తా” అని సవాల్ విసరడం వరకు వెళ్లి, ఒక్కసారిగా 10 ఏళ్ళ నుండి అవసాన దశలో ఉన్న ‘ఆంధ్ర – తెలంగాణ’ సెంటిమెంట్ ను పైకి లేపింది.

ఆ సందర్భంలో​ వారి నోటి నుండి దొర్లిన బూతు పదజాలం అ​వి విన్న వారి ఒళ్ళు జలదరించేలా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. 

ఇప్పుడు ఆంధ్ర అనే ట్యాగ్ ని పొందిన అరికెపూడి గాంధీ గత ఎన్నికల్లో BRS బీ ఫార్మ్ పైనే టికెట్ తెచ్చుకుని గెలవడం, అలాగే 2014లో ఆయన టీడీపీ తరపున గెలిచి ఆ తరువాత బీఆర్ఎస్ లోకి  అప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకుని జంప్ చేయడం ఈ పూర్తి ఎపిసోడ్ లో కొసమెరుపు.

దీన్ని రాజకీయ నాయకులు ఏ వానకి ఆ గొడుగు పడతారు అన్నదానికి ఇది పర్ఫెక్ట్  ఉదాహరణగా చెప్పవచ్చు. రాజకీయాల్లో ఈ ‘జంపింగ్ జపాంగ్’ కల్చర్ ఒక భాగమైన ఈ వేళ ఇటువంటి సన్నివేశాలకి ఏమాత్రం కొదవ ఉండదు.

* * *

Scroll to Top