రాచపల్లి శ్రవణ్ కుమార్
కుటుంబ బంధాలకు మానవ సంబంధాలకు మనిషిని మనిషిగా ప్రేమించే అంతులేని అనుభూతులకు ఆత్మీయత అనుబంధాలకు ముఖ్యంగా స్త్రీలకు తల్లిగారిల్లు , పిల్లలకు అమ్మగారిల్లు అనాదిగా వస్తున్న అనురాగ కేంద్రాలు.
జంతువులు తమ కన్న పిల్లలను కొంత వయసు వరకు మాత్రమే ఆలనా పాలనా చూసి ఆ తరువాత లోకానికి అప్పజెబుతాయి కానీ చివరిదాకా బాధ్యత తీసుకోవూ. 5,10 సంవత్సరాల ప్రమాణము కలిగినటువంటి జంతువులకే అంత తొందరలో ఎడబాటు తప్పినటువంటి పరిస్థితి ఉంటే దానికి భిన్నంగా భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కన్న తల్లిదండ్రులు పిల్లలకు మధ్య అనుబంధం దశాబ్దాల పాటు కొనసాగడం అనేది మానవ జీవితానికి గల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
అనేక ఆటంకాలు, వైరుధ్యాలు, సంఘర్షణలు, స్వార్థ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆటుపోటుల మధ్యనైనా తల్లి పిల్లల అనుబంధం జీవించినంత కాలం దాదాపుగా కొనసాగడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇటీవల కాలంలో అక్కడక్కడ ఘర్షణలు స్వార్థ ప్రయోజనాల కారణంగా మధ్యలోనే బంధాలు తెగిపోతున్న సందర్భాలను కూడా గమనించవచ్చు . అయినా కొన్ని చోట్ల సమాజం పట్టించుకోవడం, మరికొన్నిచోట్ల పోలీసులు చట్టం జోక్యం చేసుకోవడం, మరికొన్నిచోట్ల తామే సంస్కరించుకొని ప్రక్షాళన చేసుకుని మానవ సమాజంలో కలిసిపోవడానికి చేసే ప్రయత్నాల కారణంగా కూడా ఎడబాటు అయినటువంటి అనేక కుటుంబాలు మళ్లీ కలిసిపోయిన సందర్భాలను మనం చూడవచ్చు.
ఈ మధ్యకాలంలో తెలుగు చలనచిత్రం బలగం సినిమా ద్వారా విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలవటం జరిగినది. ఇదంతా తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఉన్నటువంటి రక్తసంబంధం సామాజిక కుటుంబ బాధ్యతను గుర్తించడం, కడుపు చీల్చుకుని పుట్టిన కారణంగా ప్రేమానురాగాలు చట్టబద్ధం కావడం వల్ల కూడా తల్లిగారిల్లు అనే అంశం ప్రధాన వేదికగా మారుతున్నది . దేనికి అనుబంధంగా వారి సంతానం కూడా ఆ సంబంధాన్ని కొనసాగించినట్లయితే అది వారికి అమ్మమ్మగారిల్లు అవుతుంది . దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా కుటుంబ మానవ సంబంధాలు బలంగా ఉన్న ప్రతి చోట ఈ బంధము కొనసాగుతుంది అనడంలో అభ్యంతరం లేదు కానీ కొంత అటు ఇటుగా సాంప్రదాయాలు ఆచారాలు అలవాట్ల కారణంగా ప్రాంతాలు భాషలు, రాష్ట్రాల వారిగా కొంత మార్పు ఉంటే ఉండవచ్చు.
* * *తల్లిగారిల్లుతో కూతురికి ఉన్న బంధం
బాల్యం నుండి పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగే కూతురు పెళ్లీడుకు వచ్చిన సందర్భంలో తగిన ఈడు జోడు చూసి పెళ్లి చేయడం అనాదిగా వస్తున్న ఆచారము. ఆదిమ జాతులతో పాటు అనేక జాతులలో సాంప్రదాయాలు ఆచారాలు కొంత భిన్నంగా ఉండవచ్చు కానీ తల్లిదండ్రులతో కన్న కూతురికి ఉన్న సంబంధం విషయంలో పెద్దగా తేడా ఉంటుందని నేను అనుకోవడం లేదు. పెళ్లయిన తర్వాత నుండి స్వతంత్ర జీవితానికి అలవాటు పడే సందర్భంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
అత్తవారింట్లో ఉండే జీవన విధానాన్ని ముందుగానే కొంత శిక్షణ ఇవ్వడం, సంబంధం బాంధవ్యాలను కొనసాగించే విషయంపై ఖచ్చితంగా నిక్కచ్చిగా ఆదేశించడం, సంబంధాలు బెడిసి కొట్టకుండా సున్నితంగా వ్యవహరించాలని హెచ్చరించడం వంటి అంశాలు ప్రతి తల్లిదండ్రి కూతురికి చెప్పి ఒప్పించేవే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లుగా ఒక ఇంటికి యజమానురాలు అయినప్పటికీ తల్లి తండ్రికి మాత్రం ఆ ఆడపడుచు కొంగు చాటు బిడ్డగా ఆకు చాటు పిందెగానే మసలుకుంటుంది. ఇక్కడ ఆత్మీయత అనుబంధం రక్తసంబంధం ప్రధానంగా వ్యక్తమౌతూ ఉంటాయి .
అయితే గత కొన్ని ఏళ్లకు పూర్వం ఎంత వయస్సు వచ్చిన తర్వాత నైనా తన కూతురుకు ఆత్మగౌరవం దెబ్బతిన్న ఇబ్బందులు ఎదురైన కన్న తల్లిదండ్రులు నిక్కచ్చిగా మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దేవాళ్ళు కానీ ప్రస్తుతం *అనేక టీవీ ప్రసారాలు, సినిమాలు, మొబైల్ ఫోన్ లా మాయాజాలంలో ఉన్న సమాజంలో కూతురు అత్తవారింటికి పోయిన తర్వాత అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడంతోపాటు ముఖ్యంగా ఆత్మ న్యూనతకు అవమానాలకు గురవుతున్న సందర్భాలు కూడా అనేకం.
స్త్రీ చైతన్యం ఎంత వెల్లి విరిసిన పురుషాధిపత్యం కొనసాగుతున్న మాట ఎవరూ కాదనలేరు ఈ కోణంలోనే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావడంతో పాటు ముఖ్యంగా తాగుబోతు భర్తలతో ఏగ లేక పోవడానికి ప్రధానంగా చెప్పవచ్చు. భర్త పోషణ భారాన్ని స్వీకరించని అసమర్థ కుటుంబాలలో కన్న కూతురు తల్లిదండ్రులను ఆశ్రయించడమా లేక ఒంటరిగా ఉండడమా లేక కుటుంబ బంధాలను తెంపుకోవడం జరుగుతున్న విషయాలు కూడా గమనించదగినవి.
మరికొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించక తమ కూతుర్ని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడం సర్దుకు పోవాలని జీవితమంటే సంఘర్షణ ఒక నాటకం అని తెలియచెప్పే ప్రయత్నం చేయక కొన్ని కుటుంబాలను చెడగొడుతున్న సందర్భాలు కూడా మనం చూడవచ్చు. ఎవరి త్రోవన వారు వెళ్లే విధంగా చూడడమే తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం కూడా.
తల్లిగారిల్లు అంటే వ చ్చిపోయినప్పుడు మాత్రమే కానీ తన సంసా రాన్ని విడిచిపెట్టి ఉండడానికి కాదు అని ఆడపడుచులు తెలుసుకోవడం చాలా అవసరం. వస్తూ పోతూ ఉంటేనే ప్రేమానురాగాలు, విలువలు, సంబంధాలు కూడా శాశ్వతంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికి అనేక చోట్ల భర్తలు అర్ధాంతరంగా మరణించడం, ఆస్తులు లేకపోవడం , కుటుంబ భారాన్ని వదిలిపెట్టి వెళ్ళిన సందర్భంలో ఒంటరిగా ఉండలేక తల్లి గారి ఇంటికి వచ్చి ఆశ్ర యం పొందిన వారిని కూడా మనం చూడవచ్చు. ఈ రకంగా ప్రేమ అనుభూతులను పంచుకోవడానికి మాత్రమే కాకుండా ఆశ్రయం కోసం రక్షణ కోసం అనివార్యమైన పరిస్థితులలో భరోసా కోసం కూడా ఆడవాళ్లకు తల్లిగారిల్లు ఎంతో ఉపయోగపడుతున్నది అని చెప్పుకోవచ్చు.
ఇక ప్రతి పండుగకు ముఖ్యంగా బతుకమ్మ పండుగ, దసరా,ఇతర సందర్భాల్లో వచ్చి తిరిగి అత్తవారింటికి బరువెక్కిన హృదయంతో వెళ్లిపోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆడపడుచు విధిగా తన తల్లి గారి ఇంటికి వెళ్లడం ఆనవాయితీగా ఇప్పటికీ జరుగుతున్నదంటే తల్లిదండ్రులకు కూతురుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఇంట్లో కొత్త నిర్మాణాలు పెళ్లిళ్లు శుభకార్యాలు ఇతర అనేక కార్యక్రమాల సందర్భంలోనూ ఆడపడుచులను విధిగా ఆహ్వానించి స్వాగతం పలికి గౌరవించి కట్న కానుకలు పెట్టి ప్రత్యేక పీఠమిచ్చి గుర్తించడం అనేది కొంత అటు ఇటుగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది.
తల్లిగారిల్లు అనే సందర్భం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో దసరా పండుగ సందర్భంగా ఇతర పండుగ సందర్భంలోనూ అత్యంత ప్రీతి పాత్రంగా అమలవుతున్నది. ఇక ఇతర పండుగలు కుటుంబంలో జరిగే శుభ కార్యక్రమాలకు హద్దులే లేవు. ఆడపడుచులకు తల్లిగారిల్లు అంటే చట్టబద్ధం మాత్రమే కాదు న్యాయబద్ధంగా కూడా అనుభూతుల సందడి . ఆటంకాలు సంఘర్షణలు ఎన్ని జరిగినా తల్లి గారింటి అనుభూతిని కలకాలం కొనసాగించాలని ఈ ఆచారానికి ఏ రకంగానూ ఆటంకం కల్పించకూడదని మనం భారత సమాజాన్ని కోరుకుందాం.
* * *