సోషల్ మీడియా: వ్యసనమైతే సమస్యల మీడియా

డి. నరసింహ (Sem. II)


మనం తరచుగా మద్య పానం, డ్రగ్స్ బానిసల గురించి వింటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బానిసల గురించి వినాల్సి వస్తుంది.

ఐదు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని సామాజిక మాధ్యమాల్లో గడిపే వారిని వ్యసనపరులుగా పరిగణిస్తారు. కానీ దాదాపు 7-8 గంటలు వెచ్చించే వారూ ఉన్నారు. ఈ 7-8 గంటలు వినియోగించేది జ్ఞానం పొందడానికా అంటే కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. దీని ద్వారా యువత, పెద్దవారు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. 

సోషల్ మీడియాకు బానిసలవ్వడం ద్వారా మానసిక, నిద్ర, కంటి చూపు సమస్యలు వస్తాయి. సోషల్ మీడియా వాడకం గురించి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్లినవారు, ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు.

సోషల్ మీడియాకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా వారి సమయాన్ని వృధా చేసుకుంటూ సోమరి పోతులుగా తయారయ్యి యువత ముందుకు వెళ్లలేక, ఉద్యోగాలు సాధించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సైబర్ నేరాలు, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్ ల సమస్యలకు పరోక్షంగా సామజిక మాధ్యమాల వ్యసనమే కారణం. 

తరచుగా ఒంటరిగా ఉండడం ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటాయి.  పిల్లలు ఏడ్చినా, నవ్వాలన్నా, తినాలన్నా ఫోన్ ఇస్తుండడంతో చిన్నప్పటి నుండి వారిలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయి. అలాగే చిన్న పిల్లలైతే మట్టిలో ఆడుకోవడం మరిచారు, దీని వల్ల పిల్లలు ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎక్కువ ప్రచారం అయి, ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో కృత్రిమ మేధస్సు (ఏ.ఐ.)తో ఇబ్బందులు పెరిగాయి. ఏ.ఐ. ద్వారా తయారుచేసిన డీప్ ఫేక్ వీడియోల బారిన పడి హీరోయిన్ రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. 

మరొక స్థాయి

ఈ మధ్య డార్క్ కామెడీ, రోస్టింగ్, ట్రోలింగ్, కంటెంట్ క్రియేషన్ పేరుతో బూతులు మాట్లాడడం, సెక్సువల్ అబ్యూజ్ కామెడీ, బూతులు మాట్లాడటమే క్రియేటివిటీగా మారుతుంది. వీటివల్ల ఎంతో మంది బాధితులు మానసిక క్షోభ అనుభవిస్తూ, ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. డార్క్ కామెడీ పేరుతో ఇటీవల కాలంలో తండ్రి కూతుర్ల బంధం పై అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.

ఇలాంటి సంఘటనల ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. సోషల్ మీడియాలో 18+ కంటెంట్ వీడియోలు అధికంగా రావడం వలన చిన్నారులు,యువతపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడి అత్యాచారాలకు  దారితీస్తున్నాయి.

వేధింపులకు, వికృత కలాపాలకు అడ్డాగా మారిన ఈ సోషల్ మీడియా పై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాలకు,OTTలకు ఎలాగైతే సెన్సార్ ఉందో, 18+ వీడియోలు ప్రసారమవుతున్న సోషల్ మీడియా పై సెన్సార్ నియంత్రణ ఉండేట్టుగా జరగాలి.

సోషల్ మీడియాని ఏ విధంగా వాడాలి, వాటి ద్వారా జరుగుతున్న నష్టాలు, నేరాలు, వేధింపులు, దుష్ప్రభావాల గురించి స్కూల్స్, కాలేజీల్లో ప్రభుత్వం, సామాజిక కార్యకర్తలు అవగాహన కార్యక్రమాలు జరపాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, వాళ్ళు ఎలాంటి కంటెంట్ ను చూస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలి.

* * *

Scroll to Top