ఒక సమర్థుడైన అసమర్థుడి గాథ

పుస్తకం: అసమర్థుని జీవయాత్ర
రచన: త్రిపురనేని గోపీచంద్
పేజీలు: 132
తొలి ముద్రణ: 1947


సమీక్ష: ఈగుర్ల వేణు

కథానాయకుడు సీతారామారావు ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినవాడు. అతను చిన్నప్పటి నుంచీ లోకం పోకడకు భిన్నంగా ఆలోచిస్తాడు. ఆస్తి, పరువు, సంప్రదాయాలు, బంధుత్వాలు, వివాహం, మతాచారాలు వంటి వాటిపై అతనికి నమ్మకం ఉండదు. తండ్రి మరణం తర్వాత ఆస్తి బాధ్యతలు మీద పడినా, వాటిని కాపాడుకోవడంలో అతనికి ఆసక్తి లేదు. లోకం దృష్టిలో అతను పనికిరానివాడు, వ్యవహార జ్ఞానం లేనివాడు, అంటే “అసమర్థుడు”.

ఒక వ్యక్తి జీవితంలో అన్ని చూడాలి మంచి చెడు, అందులో నుండి ఏం నేర్చుకున్నాడు దాన్ని ఎలా అమలు చేశాడు, బంగారం లాంటి జీవితాన్ని తనకున్న అభద్రతా భావాలతో ఎలా నాశనం చేసుకున్నాడు, తననే నమ్ముకున్న వల్ల మీద ఎలా తన కోపాన్ని వ్యక్తం చేసాడు చివరకి ఎలా అంతం అయ్యాడు అనేదే ఈ అసమర్ధుడి గాథ.

గోపీచంద్ రాసిన ఆ కథ మన అందరి కథ, ఈ అసమర్ధుడి లాగే మనం కూడా ప్రవర్తిస్తాం, అన్ని ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే వారి కోసం ఏం అయినా చేస్తాం, మనవాళ్లే అనుకుంటాం, కానీ వాళ్ళ నిజ స్వరూపం గ్రహిచలేకపోతాం, వాళ్ళు వాళ్ల అవసరాల కోసం మనల్ని వాడుకుంటారు అది గ్రహించి ఎవరికి ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి, ఏమీ లేనప్పుడు హెచ్చులకి వెళ్లకుండా ఉండాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనం కాపాడుకోవాలి. ఏదో దొరకలేదు అని అసంతృప్తి పడకుండా ఉన్న దానితో సంతోషించాలి.

ఈ బుక్ వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు:
— సోమరితనం అన్ని అపజయాలకు కారణం
— మన ఆలోచనలు మన అదుపులో ఉండాలి
— ఆర్ధిక సమస్య కుటుంబంలో ని అందరి సమస్య
— మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి….

అసమర్థుని జీవయాత్ర కేవలం ఒక వ్యక్తి కథ కాదు; ప్రతి ఆలోచనాపరుడి లోపల జరిగే సంఘర్షణకు అద్దం. విజయం అంటే ఏమిటి, సమర్థత అంటే ఏమిటి అనే ప్రశ్నలను పాఠకుడి ముందు ఉంచే ఈ నవల తెలుగు సాహిత్య విద్యార్థులు, పాఠకులు తప్పక చదవాల్సిన రచన.