రాచపల్లి శ్రవణ్ కుమార్
ప్రతి వ్యక్తి జీవితంలోనూ కష్టసుఖాలు సాధారణమైనప్పటికీ భవిష్యత్తు సంతోషంగా, సుఖవంతంగా, ఆత్మస్థైర్యంతో ప్రగతి దాయకంగా జరగాలని కొత్త సంవత్సర ప్రారంభం రోజున అందరూ కోరుకుంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. అదే సందర్భంలో ఇతరులకు సంబంధించి కూడా తన మిత్రులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు బంధుమిత్రులు కూడా బాగుండాలని కోరుకోవడం కూడా మానవతా వాదానికి దర్పణంగా భావించాల్సిందే. అయితే ఈ పేరుతో కొనసాగుతున్నటువంటి ఆడంబరాలు, కేకుల కటింగు, వెలుగు దివ్వెలు, టపాసులు పేల్చడం, అంతకు మించినటువంటి క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల నిర్వహణ పూర్తిగా వ్యాపార ధోరణితో జరగుతున్నది.
గత సంవత్సరంలో అనుభవించిన కష్టాలు లేదా ఎదుర్కొన్న బాధలు ఇబ్బందులు అన్ని రాబోయే కాలంలో మరిచిపోవాలని దాని స్థానంలో మెరుగైన జీవితం గడపాలని ప్రతి వ్యక్తి కోరుకునే సందర్భం నూతన సంవత్సర ప్రారంభం. ప్రైవేటు రంగంలో కొనసాగుతున్నటువంటి క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల నిర్వహణ అంతా కూడా వ్యాపారమయమై వందలు వేల రూపాయల టికెట్ తో నిర్వహించడం రాత్రి ఒకటి వరకు కూడా వాటిని కొనసాగించడం ఆ సందర్భంలో అనేక రకాలైన అకృత్యాలు అఘాయిత్యాలకు తెరతీయడాన్ని మనం గమనించవచ్చు.
ఇక ఆడంబరాల పేరుతో మద్యపానం మత్తు పదార్థాలు వినియోగం అంతా ఇంతా కాదు. 2025 జనవరి ఒకటవ తేదీ సందర్భంగా డిసెంబర్31 నాడు జరిగినటువంటి 420 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఇదేదో గొప్ప సాధించినట్టుగా పత్రికల్లో పతాక శీర్షికన రావడం సమాజాన్ని తప్పుతో పట్టించడమే. యువతను నాశనం చేయడమే. అనారోగ్య భారతాన్ని సృష్టించడమే అవుతుంది.
ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలు ముఖ్యంగా సిటీలలో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తే ఏ రకమైన సామాజిక ప్రయోజనం కూడా మనకు తారసపడదు. అశ్లీల అర్థనగ్న దృశ్యాలు, అశ్లీల సాహిత్యము, ఆడంబరాలు మాత్రమే తప్ప మానవ జీవిత విలువలు, భవిష్యత్తు కర్తవ్యాలు, గెలుపు ఓటముల పునరాలోచన, భవిష్యత్తు పైన విశ్వాసంతో పనిచేయాలనే సందేశాలు కానీ చర్చలు కానీ ఏమాత్రం కన్ఫడవు. కేవలం తాత్కాలికంగా సంతోషపెట్టి మత్తులో ధించి ఆకృత్యాలకు పాల్పడే విధంగా ఆకర్షణను కొనసాగించడానికి మాత్రమే తోడ్పడుతున్నటువంటి ఈ కార్యక్రమాలను ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది.
పెద్ద మొత్తంలో టికెట్ తో ఈవెంట్ ను చూడాలంటే సామాన్యులకు సాధ్యం కాదు కదా అలాంటప్పుడు ప్రభుత్వ పరంగానే గ్రామాలలో పట్టణాలలో వీధులు వాడలు వార్డుల వారీగా నూతన సంవత్సర సందర్భంగా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించి అనుభవజ్ఞ చేత ప్రసంగాలు ఇప్పించడం ద్వారా తమ జీవితాలలో రావలసిన మార్పులకు సరైనటువంటి మార్గ నిర్దేశాన్ని పొందే అవకాశం ఉంటుంది.
కొన్ని రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వాళ్లు, నిపుణులు, మేధావుల ద్వారా స్ఫూర్తివoతమైన ప్రసంగాలను కొనసాగించినట్టయితే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పేదలు, విద్యార్థులు యువత ఎంతో స్ఫూర్తిని పొందే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ కార్యక్రమాలను కొత్త సంవత్సర సందర్భాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దాలి కానీ ఆడంబరాలకు తల పెడుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మూర్ఖత్వం.కొత్త జీవితానికి పరస్పర శుభాకాంక్షలు
సాధారణంగా 31 డిసెంబర్ రాత్రి మొదలయ్యే ఈ కార్యక్రమాలు రెండు మూడు రోజులపాటు కూడా పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడంతో కొనసాగుతుంటాయి. కేవలం మొక్కుబడిగా అభినందనలు తెలుపడం వేరు అందులోని అంతరార్థాన్ని గుర్తించడం వేరు. ప్రతి సందర్భానికి ప్రయోజనం, సార్థకత ఉన్నట్టే ఈ సందర్భాన్ని కూడా మనం వినియోగించుకోవలసిన అవసరం ఉంది.
అంటే ఒకరి అనుభవాలను మరొకరు గ్రహించడం, ఒకరి వైఫల్యాలు విజయాలను సేకరించడం, తమ పొరపాట్లు తప్పిదాలను సవరించుకోవడం, గతంలో జరిగినటువంటి అపశృతులు మళ్లీ కొత్త సంవత్సరంలో జరగకుండా చూసుకోవడానికి మార్గాలను అన్వేషించడం, వీలైతే ఇతరుల ద్వారా సలహాలను స్వీకరించడం, గత సంవత్సరం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా ప్రక్షాళన చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రకటించడం వంటి కార్యక్రమాలతో ఈ నూతన సంవత్సర వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉంది.
విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలవారు, యువత, వృద్ధులు, మహిళలు, రచయితలు, కవులు, కళాకారులు, రైతులు, శ్రామికులు, విభిన్న వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూనే రాబోయే కాలంలో మరింత స్ఫూర్తివంతమైన జీవితాన్ని పొందడానికి, హక్కులను సాధించుకోవడానికి, బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి, అవసరమైతే చట్టబద్ధంగా పాలకులను ప్రశ్నించడం ద్వారా రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందడానికి సంసిద్ధమై ఉమ్మడిగా సమాయత్తం కావలసిన సందర్భం కూడా ఇది.
ప్రణాళికలు ఏమిటి? లక్ష్యాలు, ఆచరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రకటించుకోవడం కూడా ఈ రోజున జరగాల్సిన అవసరం. కానీ ఇలాంటి అంశాలు ఏమీ లేకుండా కేవలం మద్యం తాగడం, మత్తు పదార్థాలతో ఊరేగడం, మాంసాహారంతో ప్రతి కుటుంబం కూడా వందలు వేల రూపాయలను ఖర్చు చేసి ఆడంబరంగా గడపడానికి మాత్రమే వెచ్చిస్తే కేవలం మొక్కుబడిగా లక్ష్యము లేని క్షణకాల ప్రయోజనాన్ని మాత్రం ఆశించే వ్యక్తులుగానే మిగిలిపోతారు.
అసమానతలు, అంతరాలు, దోపిడీ పీడనతో అనేక రకాలుగా విచ్ఛిన్నమైనటువంటి సామాజిక వ్యవస్థను కనీసం ఈ సందర్భంగా నైనా ప్రస్తావన చేసుకోవడం ద్వారా మనుషులందరూ సమానమే, మానవతా విలువలను మనం సంతరించుకోవాలి, తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలగాలి, పేదరికం నిర్మూలించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ఆ వైపుగా యువత ప్రభుత్వాలను ప్రశ్నించాలి, చట్టసభల్లో అలాంటి చర్చలు జరగాలి అని కోరుకునే యువత విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావులు ఈ రోజున శపథం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది.
ఇలాంటి కనీసమైనటువంటి ఆలోచన ఏదీ లేకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద నుండి సంపన్నులు కోటీశ్వరుల వరకు కూడా మొక్కుబడి వ్యాపకంగా ఈ సందర్భాన్ని కొనసాగిస్తే లక్ష్యాలను సాధించేది ఎప్పుడు? ప్రణాళికలు అమలు చేసి కొత్తదనాన్ని సాధించడం అసాధ్యమే కదా! అంటే చుక్కాని లేని నావలా ప్రయాణించే మానవ జీవితాలకు నూతన సంవత్సర సందర్భం ఒక మార్గాన్ని గమ్యాన్ని లక్ష్యాన్ని నిర్దేశించే విధంగా నిర్వహించుకోవడానికి ఇకనుండి అయినా వ్యక్తులు శక్తులు, సంఘాలు, సమూహాలు చివరికి ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు పూనుకుంటే మంచిది.
వ్యాపార ధోరణిలోనైనా కొంత వాస్తవికత, సామాజిక జీవితాన్ని మేళవించే విధంగా కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది. ప్రజా జీవితాలకు బాధ్యత వహించవలసిన ప్రభుత్వాలు గుడ్డిగా చూస్తూ అనుకరిస్తే జరిగే అనర్థాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది.
* * *