టి సందీప్
భాగ్యనగరం గతమెంత ఘనంగా ఉన్నా ప్రస్తుతం మాత్రం చిన్న వానకి కూడా గజగజా వణికిపోతుంది. దీనికి ప్రధాన కారణం నగరంలో ఉన్న చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావడమే.
గత నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, ఎక్కడ చూసినా లేదా విన్నా ‘హైడ్రా’ గురించిన చర్చనే జరుగుతున్నది. కారణం సినీ హీరో నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ ని కూల్చివేయడం. అలాగే, నగరానికి చుట్టూ ఉన్న చెరువులు, వాటి బఫర్ ప్రాంతాలు, చెరువుల పూర్తి స్థాయి సరిహద్దుల లోపల నిర్మించిన కట్టడాలకు నోటీసులు జారీ చేయడం ద్వారా ఈ సంస్థ వార్తల్లో నిలిచింది.
తెలంగాణ సర్కార్ కొత్తగా రూపొందించిన ఈ హైడ్రా సంస్థ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువుల ఆక్రమణలు గుర్తించి, అలాంటి నిర్మాణాలని కూలుస్తున్నది. ఈ సంస్థకు ఐ.పి.ఎస్. అధికారి ఎ.వి. రంగనాధ్ నేతృత్వం వహిస్తుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తి లేదని, ఈ ఆక్రమణల లిస్ట్ లో తన కుటుంబ సభ్యులు, పార్టీ వారు ఉన్నా కూడా ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
నేపథ్యం ఏమిటి?
హైదరాబాద్ లో రోజురోజుకీ పెరుగుతున్న జనాభా, వారి నివాసాల కోసం ఏర్పాటవుతున్న కట్టడాల విషయాన్ని పరిశీలిస్తే, ఈ చెరువుల కబ్జాలు లేదా ఆక్రమణల గురించి ఒక స్పష్టత వస్తుంది.
గత కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వర్షపాతం తగ్గడం తద్వారా చెరువులు, కుంటల్లో నీటి నిలువలు తగ్గిపోవడంతో చెరువు చుట్టుపక్కన ఉన్న భూములపై అందరి దృష్టి పడింది. ఆ భూముల్లో ఇండ్లు, రిసార్టులు, అపార్ట్మెంట్స్, కాలేజీలు, ఇతర వాణిజ్య భవనాలు వెలిశాయి. సాధారణంగా వర్షం గరిష్ట స్థాయిలో కురిస్తే చెరువులు తమ పూర్తి సామర్ధ్యంతో నిండుతాయి. చాలా సంవత్సరాల తరువాత వర్షపాతం ఒక్కసారిగా పెరిగిపోవడంతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి.
అలా నిండిన వాటి నుండి FTL , బఫర్ జోన్స్ లో ఉన్న కట్టడాల్లోకి నీరు చేరడం మొదలైంది. ఇక అక్కడ వర్షపు నీరు తరలించే నాలాలు కూడా ఆక్రమణలకు గురికావడంతో, ఆ నీరు వెళ్లే దారి లేక చివరకి రోడ్ల పైకి వరద రూపంలో వస్తున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడడం, దానిని అదుపుచేయడానికి మ్యాన్ హొల్స్ తెరిస్తే, ప్రమాదవశాత్తు అందులో సామాన్య ప్రజలు పడిపోవడం వంటివి గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము.
ఇలా ఒకదానికి మరొకటి ముడిపడి, చివరికి ఒక మోస్తరు వర్షానికే నగరం మునిగేలా తయారయింది.
కూల్చడమే పరిష్కారమా?
ఇక ఇప్పుడు ఈ హైడ్రా చేపడుతున్న చర్యలని అత్యధిక శాతం మంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ నగర శివార్లలో ఉన్న వారు ఈ సంస్థ చర్యలని ప్రశంసిస్తూ వారికి మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నారు.
అయితే ఈ కూల్చివేతలో భాగంగా చాలా ఏళ్ళ నుండి నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కూడా ఇందులో ఇండ్లు కోల్పోతున్నారు. ఉన్నట్టుండి వారు నివాసాన్ని కోల్పోవడం, ఎక్కడికి వెళ్లి బ్రతకాలో తెలియని స్థితిలో ఉండడం ఒకరకంగా శోచనీయం.
అయితే ఈ పూర్తి అంశాన్ని మనం ఒకసారి నిశితంగా గమనిస్తే, ఆక్రమణలను తొలగించడం ప్రథమ కర్తవ్యమైతే వీటి కారణంగా నిరాశ్రయాలవుతున్న వారికి తాత్కాలికంగానైనా నివాసాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి.
మరీ ముఖ్యంగా అసలు ఈ కట్టడాలకు చట్టంలోని లొసుగులు వాడుకుని అనుమతులు ఇచ్చిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ హైడ్రా యొక్క రూపకల్పనకు ఒక అర్థం ఉంటుంది.
చివరగా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా హైదరాబాద్ నీటి సమస్యను, డ్రైనేజ్ సమస్యను, అలాగే వర్షాకాలంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యకు ఇది ఒక పరిష్కారం చూపే అవకాశం ఉంది. ఇది సవ్యంగా పనిచేస్తే, హైదరాబాద్ నగర గతి మారే అవకాశం కచ్చితంగా ఉంది. ఈ సంస్థను నిజాయితీగా, ఎటువంటి జోక్యం లేకుండా, తన పని తాను చేసుకోనిస్తే మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
కొసమెరుపు — ప్రస్తుతం ఈ హైడ్రా సంస్థ కార్యాలయం ఉన్న బిల్డింగ్ కూడా హుసేన్ సాగర్ బఫర్ జోన్ లో ఉంది. మరి దానిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించిన మాజీ ఆర్ధిక, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు.
* * *